యువ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వైద్య చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తున్నారు. అయితే, సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపైనే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ప్రమాదం జరిగినప్పుడు ఆయన ఎంత స్పీడ్‌తో వెళుతున్నారు ? ఆయన మద్యం తాగి ఉన్నారా ? రేసింగ్‌లో పాల్గొన్నారా ? వంటి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయాలపై అనేక తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. వీటన్నింటికీ పోలీసుల విచారణలో ఒక క్లారిటీ వచ్చింది. సాయిధరమ్ తేజ్ ప్రమాద ఘటనపై సైబరాబాద్ పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. పోలీసుల విచారణలో తేలిన విషయాలను డీసీపీ వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ రేసింగ్‌కు వెళుతున్నట్లు ఎటువంటి సాక్షాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ మద్యం సేవించి బైక్ నడిపినట్లు కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదని డీసీపీ స్పష్టం చేశారు. అయితే, నిబంధనల కంటే కూడా ఆయన ఎక్కువ స్పీడ్‌తో వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పైన పోలీసుల నిబంధనల ప్రకారం మ్యాగ్జిమం 40 కిలోమీటర్ల స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. కానీ, కేబుల్ బ్రిడ్జ్‌పై సాయి ధరమ్ తేజ్ 102 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లారని పోలీసులు గుర్తించారు.
అయితే, ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం సాయి ధరమ్ తేజ్ బైక్ 76 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళుతున్నట్లు గుర్తించారు. సాయి ధరమ్ తేజ్ ముందుగా వెళుతున్న ఆటోను కుడివైపు నుంచి కాకుండా ఎడమ వైపు నుంచి ఓవర్‌టెక్ చేసే ప్రయత్నం బ్రేక్ వేయగానే బైక్ అదుపుతప్పి కిందపడ్డారని కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.