ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని మరి కొద్ది రోజుల్లోనే ఎదుర్కోబోతున్నామని ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. మరి కొద్ది వారాల్లోనే వాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్నారు. వాక్సిన్ కు అనుమతులు లభించిన వెంటనే భారత్ లో పంపిణీ ప్రారంభిస్తామన్నారు. మొదట తెలిపిన విధంగానే కోవిడ్ వారియర్స్ కె మొదట వాక్సిన్ పంపిణీ ఉంటుందన్నారు.
శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోడీ వర్చువల్ ద్వారా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితులు, వాక్సిన్ పై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. వాక్సిన్ ధరలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించిన తర్వాతనే ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తామన్నారు.
కాగా వాక్సిన్ పంపిణీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే వాక్సిన్ పంపిణీ ప్రక్రియలో భారత్ కు మంచి అనుభవం ఉందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు వాక్సిన్ ను సమర్థవంతంగా పంపిణీ చేయగలరన్నారు. అదే విధంగా వ్యాక్సినేషన్ పై అఖిలపక్ష నేతలను సలహాలు, సూచనలను ఇవ్వాల్సిందిగా మోదీ కోరారు. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు ప్రపంచమంతా వాక్సిన్ కోసం భారత్ వైపు చూస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.