భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. ఇవాళ ఉదయం సంజయ్కు ఫోన్ చేసిన ప్రధాని 10 నిమిషాల పాటు మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోలింగ్ సరళి, తెలంగాణలో పార్టీ పరిస్థితిపైన ప్రధాని ఆరా తీశారు. ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పని చేశారని బండి సంజయ్కు మోడీ అభినందనలు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రదర్శించిన స్ఫూర్తితోనే ముందుకు పోవాలని బండి సంజయ్కు ప్రధాని మోడీ సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దాడుల గురించి ప్రధాని దృష్టికి సంజయ్ తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. తాము అండగా ఉంటామని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని ప్రధాని అభయమిచ్చినట్లు సమాచారం.
తెలంగాణలో బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికలను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకత్వం ఎన్నికల్లో విజయం సాధించేందుకు శక్తియుక్తులు ప్రదర్శించింది. అనూహ్యంగా తక్కువ సమయంలోనే జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు కనిపిస్తోంది.