తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లే దారిలో ఉప్పల్, ఎల్బీనగర్లో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు. తెలంగాణలో జనసేన జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడి రాజకీయాల్లో విద్యార్థులు ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. తెలంగాణ రాజకీయ సమరంలో జనసేన ఉంటుందని, భవిష్యత్తులో జనసేన జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు.
తెలంగాణలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సత్తా చాటుతామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. జీహెచ్ఎంసీలో గతంలోనే పోటీ చేద్దామని అనుకున్నా కొన్ని కారణాల వల్ల ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని పవన్ చెప్పారు.