రాజకీయాల్లో కొంత కాలం పాటు తీరిక లేకుండా గడిపిన తర్వాత మళ్లీ సినీ జీవితాన్ని ప్రారంభించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో ఆయన గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. హిందీలో వచ్చిన పింక్ సినిమాకు ఇది రీమేక్. వకీల్ సాబ్‌లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే, వకీల్ సాబ్ సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
ఈ సినిమా గురించి అనేక విషయాలు బయటకు వచ్చినా పవన్ రెమ్యునరేషన్ గురించి మాత్రం బయటకు తెలియడం లేదు. తాజాగా ఇందుకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది. ఎవరూ ఊహించని స్థాయిలో, మరెవరికీ సాధ్యం కాని రీతిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. వకీల్ సాబ్ సినిమాకు పవన్ కళ్యాణ్‌కు రూ.50 కోట్లు ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా తీయాలనేది దిల్ రాజుకు ఒక డ్రీమ్. ఇంతకాలానికి వకీల్ సాబ్తో దిల్ రాజు కల నెరవేరబోతోంది. అందుకే ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ భారీ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.50 కోట్లు పవన్ కళ్యాణ్‌కు ఇవ్వనున్నారు. ఇందులో మొదట రూ.25 కోట్లు ఇచ్చి సినిమా పూర్తై విడుదలకు సిద్ధమయ్యే సమయంలో మరో రూ.25 కోట్లు ఇవ్వాలనే విధంగా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.
రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేయాలని చూస్తున్న పవన్ కళ్యాణ్ తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. అవుట్డోర్ షూటింగ్‌లకు కూడా ఆసక్తిగా లేరు. కథలు కూడా ఇందుకు తగ్గట్లుగానే ఎంచుకుంటున్నారు. వకీల్‌సాబ్ స్టోరీ కూడా ఇలాంటిదే. పవన్ ఈ సినిమాలో నటించడానికి కేవలం రెండు నెలల లోపే డేట్స్ ఇచ్చారు. అంటే రెండు నెలలకే పవన్ రూ.50 కోట్లు అందుకుంటున్నారంటే మామూలు విషయం కాదు.
కాగా, వకీల్ సాబ్ నిర్మాణం విషయంలో దిల్ రాజు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పవన్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉన్నందున సినిమాను తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేయాలని చూస్తున్నారు. రూ.40 కోట్లలో సినిమాను పూర్తి చేసేస్తే మొత్తం రూ.90 కోట్లతో సినిమా అయిపోతుందని అనుకుంటున్నారు. అంటే మొత్తం సినిమాకు అయ్యే ఖర్చు కంటే పవన్ కళ్యాణ్ ఒక్కడి రెమ్యునరేషన్ ఎక్కువ అనమాట. కాగా, వకీల్ సాబ్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. కరోనా లేకపోతే ఈపాటికి సినిమా విడుదల కూడా అయ్యేది.