తెలుగు నాట భారీ క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాలో నటిస్తే ఆ సినిమా రిజల్ట్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తే ఆ కుటుంబ అభిమానులకు పండుగే. త్వరలోనే ఈ పండుగ చేసుకోనున్నారు మెగా అభిమానులు. తమ అభిమాన హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాను ఇండియాలోనే టాప్ డైరెక్టర్ తీస్తారని తెలుస్తోంది.
బాహుబలి సినిమాతో మన తెలుగు హీరోల క్రేజ్, టాలీవుడ్ స్టామినా దేశమంతా తెలిసిందే. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి మరో ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మరో భారీ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించి ప్రచారం జరుగుతోండటంతో మరింత ఆసక్తి నెలకొంది.
వైవిధ్య సినిమాలను తెరకెక్కిస్తే దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు శంకర్ ఒక మల్టీస్టారర్ మూవీకి కథ సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ సారి తమిళ హీరోలతో కాకుండా ఇద్దరు తెలుగు హీరోలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైపు ఆయన చూస్తున్నారని చెబుతున్నారు.
శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో కొత్త సినిమా మొదలుపెట్టేందుకు శంకర్ సిద్ధమవుతున్నారు. ఇందుకు గానూ కథ కూడా సిద్ధం చేసుకున్నారు. మల్టీస్టారర్ కమర్షియల్ మూవీ కథ ఇది. దీనికి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ అయితే బాగుంటుందని శంకర్ అనుకుంటున్నారట. ఇందుకు గానూ ఒక తెలుగు టాప్ ప్రొడ్యూసర్‌తో కూడా శంకర్ చర్చలు జరిపారని చెబుతున్నారు.
దర్శకుడు, నిర్మాత ఒకే అయినందున పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌కు త్వరలోనే కథ వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శంకర్ వంటి పెద్ద దర్శకుడితో సినిమా అంటే ఈ ఇద్దరు హీరోలు అంగీకరించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇదే జరిగితే త్వరలోనే తెలుగు సినిమా చరిత్రలోనే భారీ సినిమాల్లో ఒకటి తెరకెక్కే అవకాశం ఉంది. బాబాయి పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ కలిసి నటిస్తే మెగా అభిమానులకు ఈ సినిమా చాలా స్పెషల్ కానుంది.