పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమాల లిస్టులో మరో సినిమా చేరింది. ఈసారి ఆయన మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నారు. మళయాలంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్‌లో నటించేందుకు పవన్ కళ్యాణ్ ఓకే చెప్పారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్తగా మారింది. గోపాల గోపాల తర్వాత పవన్ నటిస్తున్న మరో మల్టీస్టారర్ సినిమా ఇది. ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూపులు కూడా అవసరం లేదు.
ప్రస్తుతం లిస్టులో ఉన్న సినిమాలు అన్నీ పూర్తైన తర్వాత కాకుండా మధ్యలోనే ఈ మల్టీ స్టారర్ రీమేక్‌ను తీసుకురావాలనే ఆలోచనతో పవన్ ఉన్నారట. దీంతో అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను ముందు వెంకటేష్, రానా కలిసి తీస్తారనే ప్రచారం జరిగింది. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఈ సినిమా సరిగ్గా సరిపోతుందని భావించిన నిర్మాతలు ఆయనను సంప్రదించగా ఇందులో నటించేందుకు పవన్ ఓకే చెప్పారు.
మరో హీరో విషయంలో మాత్రం నిర్మాతలు రానానే ఎంపిక చేసుకున్నారు. రానా ఈ సినిమాకు ఓకే చెప్పడంతో అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ – రానా నటించడం దాదాపు ఖాయమైంది. సితార ఎంటర్టైన్మెంట్ వాళ్లు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. వీరే ఈ సినిమా నిర్మించే ఛాన్స్ ఉంది. కానీ, దర్శకుడు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. కానీ, గోపీచంద్ మలినేని పేరు ఈ సినిమా కోసం ఎక్కువగా వినిపిస్తోంది.
2020 ఫిబ్రవరిలో మళయాలంలో వచ్చింది అయ్యపనుమ్ కోషియమ్ సినిమా. అక్కడ ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు. ఒకరు ఎస్సై కాగా మరొకరు మిలిటరీలో హవల్దార్‌గా పని చేసి వస్తారు. ఒకసారి ఈ హవల్దార్ కారులో మద్యం బాటిళ్లతో ఎస్సైకి చిక్కుతాడు. ఇద్దరు హీరోలకు ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవ పెద్దదవుతుంది.
ఒకరి మీద ఒకరు పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగం పోవడం, అతడి భార్య అక్రమ కేసుల్లో అరెస్టు కావడం వరకు వెళుతుంది. ఇలా ఇద్దరు హీరోల మధ్య జరిగిన ఓ చిన్న గొడవ, దాని తర్వాత దారి తీసిన పరిస్థితులు, చివరకు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఈ సినిమా కథ ఉంటుంది. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కించారు. ఇప్పటికే చాలా మంది తెలుగు ప్రేక్షకులు కూడా మళయాళంలోనే ఈ సినిమాను చూశారు. ఇప్పుడు తెలుగులో రీమేక్ అవుతుండటంతో రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.