అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ విరాళం ఇచ్చారు. ఇవాళ తిరుపతిలో రూ.30 లక్షల చెక్‌ను తన వంతు విరాళంగా భారతీయ జనతా పార్టీ నేత కామినేని శ్రీనివాస్‌కు అందించారు. జనసేన కార్యవర్గం తరపున మరో రూ.11 వేలను సైతం పవన్ కళ్యాణ్ విరాళంగా అందించారు.
అంతకుముందు జరిగిన విలేఖరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మతాల ప్రస్తావనతో రాజకీయాలు చేయడానికి వ్యతిరేకమని, అయితే ఒక మతానికి చెందిన ఆలయాలపై దాడులు చేస్తామంటే మాత్రం ఊరుకోబోమని పేర్కొన్నారు. ఇది శాంతిభద్రతల సమస్య కూడా అని ఆయన స్పష్టం చేశారు.
ఆర్ఎస్ఎస్ చాలా సేవాభావంతో పని చేసే సంస్థ అని, ఇటువంటి సంస్థ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థికి సంబంధించి మరో వారం రోజుల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే రైతు సమస్యలపై చలో అసెంబ్లీ నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.