మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు జనసేన పార్టీకి తలనొప్పిగా మారాయి. మహాత్మ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేకు అనుకూలంగా ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యల పట్ల నాగబాబుతో పాటు జనసేన పార్టీపై కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
జనసేనలో లక్షలాదిగా ఉన్న నాయకులు, జన సైనికులు, అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేసే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఇప్పటికే చెప్పామని, ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పార్టీ అభిప్రాయాలను, నిర్ణయాలను పార్టీ అధికారిక ప్రకటన ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తుందని, వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు.
ఇది ప్రజలు అనుకోని కష్టాలను ఎదుర్కుంటున్న కాలమని, కరోనాతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో మనం ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లవద్దని ఆయన జనసైనికులను కోరారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. కాగా, నాగబాబు జనసేనలో ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.