హైదరాబాద్ జీహెచెంసీ ఎన్నికల బారినుంచి జనసేన పార్టీ తప్పుకుంది. జనసేన పోటీ చేస్తున్నట్టుగా రెండు రోజుల క్రితం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గ్రేటర్ ఎన్నికలపై సంచలన ప్రకటన చేసారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన బీజేపీ పార్టీకే పూర్తి మద్దతునిస్తుందని ప్రకటించారు. కార్యకర్తలకు, పార్టీ వర్గాలకు ఇష్టం లేకపోయినా ఈ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోని నాదెండ్ల మనోహర్ ఇంట్లో బీజేపీ నేత కిషన్ రెడ్డి, కె. లక్ష్మణ్ తో పవన్ భేటీ అయ్యారు. చర్చల అనంతరం పవన్ మీడియాకు ఈ విషయాన్నీ వెల్లడించారు. తమ నిర్ణయం జనసైనికులను నిరాశపరుస్తుందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నగర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
హైదరాబాద్ కేంద్రంలో బీజేపీ లాంటి బలమైన వ్యవస్థ ఉండాలన్నారు. ఒక్క ఓటు బయటకు వెళ్లకుండా జనసైనికులంతా బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో సైతం తాము బీజేపీకి మద్దతిచ్చిన విషయం తెలిపారు. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు బీజేపీకే ఉంటుందన్నారు.