టాలీవుడ్ అగ్రకథానాయకులో ఒకడిగా వెలుగొందుతున్న విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెంకటేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే పవన్ వెంకీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినీ నేపథ్యం నుంచి వచ్చిన వెంకీ చిన్ననాటి నుంచి విదేశాల్లో చదువుకున్నారు. హీరోగా పరిచయం అయిన తొలి రోజుల్లో ఆయనకు తెలుగు బాష కూడా సరిగ్గా వచ్చేది కాదట. కానీ ఆ తరువాత తండ్రి రామానాయుడు ముద్రను చెరిపేసి హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఈ స్టైలిష్ హీరోకు దైవ భక్తి చాలా ఎక్కువట. ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలు సంబంధించి ఎన్నో పుస్తకాలూ చదువుతారని అందువల్లే తమ మధ్య స్నేహం బలపడిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు పవన్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.
”శ్రీ వెంకటేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మంచి మనసున్న సన్మిత్రులు, ప్రముఖ కథానాయకులు శ్రీ వెంకటేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీ వెంకటేష్ గారితో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైనది. నేను కథానాయకుణ్ణి కాక ముందు నుంచి ఆయనతో నాకు మితృత్వం ఉంది. తరచూ శ్రీ వెంకటేష్ గారితో మాట్లాడుతూ ఉండేవాణ్ణి. ఆయన మంచి చదువరి.
ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు వివరించేవారు. ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని ధృడపరచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దంపట్టింది. కొత్త తరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే శ్రీ వెంకటేష్ గారు మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.