జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి తాము సిద్ధమంటూ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. పార్టీ యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనీ నిర్ణయించుకున్నామన్నారు.
నగరవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, కమిటీల నుంచి అందుతున్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలకు ఈ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చాం. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ ఈ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది. అని పేర్కొన్నారు.