తిరుపతిలో జనసేన బీజేపీ కూటమి తర్వాత అక్కడి ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్ట్ నేతలు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పోరుపై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరనే విషయం పై ఒక అవగాహన ఉన్నప్పటికీ అభ్యర్థి పేరు ఇంకా ఫైనలైజ్ చేయలేదన్నారు. ఈ అంశంపై బీజేపీ అగ్రనేతలతో మరోసారి చర్చలు జరిపిన తర్వాతనే తుది నిరయం ప్రకటిస్తామన్నారు. మార్చి వరకు ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ఇప్పుడప్పుడే అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదని పవన్ పేర్కొన్నారు.
మరో రెండు సమావేశాల అనంతరం అభ్యర్థి పై నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే తిరుపతి పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఒక వేళ జీహెచ్ఎంసీ ఎన్నికల తరహాలోనే తిరుపతి ఉప ఎన్నికను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లైతే వారికే మద్దతు ఇవ్వాలనే అభిప్రాయం కూడా పార్టీలో ఉందన్నారు. ఈ విషయంపై మరో వారం రోజుల్లో తేలుస్తామన్నారు.
తిరుపతిలో జరిగిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి ఉప ఎన్నికలో జన సేన అభ్యర్థి పోటీ చేయాలని పీఏసీ సభ్యులు పవన్ కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు.