కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు 8వ రోజుకి చేరాయి. ఈ క్రమంలో ఈ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, ఈ మేరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నాయి.
చట్టాలు రద్దు చేయకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని, ఇతర జాతీయ రహదారులను కూడా నిర్బంధిస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రైతుల ఉద్యమంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు పూర్తిగా రైతులకు మేలు చేసేవే అన్నారు.
నూతన చట్టాలలో ఏవైనా లోటుపాట్లు ఉంటె చర్చలతో వాటిని పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఇప్పటికే ఢిల్లీలో కేంద్రం రైతులతో చర్చలు జరుపుతుందన్నారు. త్వరలోనే జై కిసాన్ పేరుతో రైతుల కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. రైతులకు అండగా నిలుస్తామన్నారు. అందుకోసం ఓ ప్రణాలికను సిద్ధం చేస్తామని పవన్ తెలిపారు. దళారీ వ్యవస్థను నిర్మూలించి.. రైతులకు మద్దతు ధర కాకుండా లాభసాటి ధర కల్పించేలా చర్చిస్తామన్నారు. తుఫాన్ నష్ట పరిహారం రైతుకు 35 వేలు ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.