ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, డిక్లరేషన్ వివాదం, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై పరిపూర్ణానంద తీవ్రంగా స్పందించారు. డిక్లరేషన్ ఇవ్వాలా, వద్దా అని మాట్లాడేందుకు కొడాలి నాని ఎవరని ప్రశ్నించారు. హిందూ ఆలయాలు, దేవుళ్లపై కొడాలి నాని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
కొడాలి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్ సైలెంట్‌గా ఉండటం సరికాదని, ఈ వ్యాఖ్యల వెనుక జగన్ ఉన్నారని అనుమానించాల్సి వస్తుందని పేర్కొన్నారు. జగన్‌కు 151 సీట్లు వచ్చాయంటే అవి హిందూ ఓట్లతోనే సాధ్యమైందని, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి కొడాలి నాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కుట్ర చేస్తున్నారేమోనని ఆయన అనుమానించారు.
దేవుడి జోలికి వచ్చిన వారు పిడికెడు బూడిద కూడా దొరకకుండా మరణిస్తారని స్వామి చెప్పారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలనేది బ్రిటీష్ హయాంలో నుంచి ఉన్న సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాన్ని జగన్ సహా అందరూ పాటించాల్సిదేనని పేర్కొన్నారు. ఆలయాలపై దాడుల విషయంలో జగన్ మౌనం వీడాలని, లేకపోతే కేంద్రం స్పందిస్తుందని అన్నారు.