logo

ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా పూర్తి వివ‌రాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా కొత్త జిల్లాలు ఏర్పాట‌య్యాయి. కృష్ణా జిల్లా రెండుగా విడిపోయింది. విజ‌య‌వాడ కేంద్రంగా కొత్త‌గా జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లాకు స్వర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు పేరు ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాగా ఈ జిల్లాకు పేరు పెట్టింది.

నిజానికి ఇంత‌కాలం కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ న‌గ‌ర‌మే పెద్ద‌ది. కానీ, కృష్ణా జిల్లాకు మ‌చిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉండేది. ఇప్పుడు మ‌చిలీప‌ట్నం వేరే జిల్లాగా ఏర్పడింది. విజ‌య‌వాడ కేంద్రంగా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్ప‌డింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. విజ‌య‌వాడ వెస్ట్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌య‌వాడ ఈస్ట్‌, నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, తిరువూరు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉన్నాయి.

ఈ జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజ‌న్లు ఉన్నాయి. ఇందులో విజ‌య‌వాడ రెవెన్యూ డివిజ‌న్ పాత‌దే కాగా, కొత్త‌గా నందిగామ‌, తిరువూరు రెవెన్యూ డివిజ‌న్లు ఏర్పాట‌య్యాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మొత్తం 20 మండ‌లాలు ఉండ‌నున్నాయి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణం 3,313 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్లు. 2011 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా జ‌నాభా 22.19 ల‌క్ష‌లుగా ఉంది.

మండ‌లాల విష‌యానికి వ‌స్తే విజ‌య‌వాడ రెవెన్యూ డివిజ‌న్‌లో ఇబ్ర‌హీంప‌ట్నం, విజ‌య‌వాడ తూర్పు, ప‌శ్చిమ‌, ఉత్త‌ర‌, సెంట్ర‌ల్‌, విజ‌య‌వాడ గ్రామీణ మండ‌లాలు, నందిగామ రెవెన్యూ డివిజ‌న్‌లో నందిగాము, వీరుల‌పాడు, కంచిక‌చ‌ర్ల‌, చంద‌ర్ల‌పాడు, జ‌గ్గ‌య్య‌పేట‌, వ‌త్స‌వాయి, పెనుగంచిప్రోలు, తిరువూరు డివిజ‌న్‌లో మైల‌వ‌రం, జి.కొండూరు, రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, తిరువూరు, ఏ.కొండూరు మండ‌లాలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఉంటాయి.

గ‌తంలో ముఖ్య‌మంత్రి కాక‌ముందు వైఎస్ జ‌గ‌న్‌ కృష్ణా జిల్లాలో ప‌ర్య‌టించిన‌ప్పుడు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడ‌తాన‌ని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే, ఎన్టీఆర్ పుట్టి పెరిగిన నిమ్మ‌కూరు గ్రామం పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గంలో ఉంటుంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నం జిల్లాలో ఉంది. కానీ, ప్ర‌భుత్వం మాత్రం కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్ పేరును ఖ‌రారు చేసింది.

Related News