ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ అనే సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను మన దేశంలో పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. నోవావాక్స్ వ్యాక్సిన్ పనితీరు, సామర్థ్యానికి సంబంధించి ఆ సంస్థ కీలక విషయాలను వెల్లడించింది.
అమెరికా, మెక్సికో దేశాల్లో 119 చోట్ల సుమారు 30 వేల మందిపై నోవావాక్స్ థర్డ్ ఫేస్ ట్రయల్స్ జరిగాయి. ఈ ట్రయల్స్ ద్వారా నోవావాక్స్ వ్యాక్సిన్ 90.4 శాతంతో కరోనా వైరస్‌పై అద్భుతంగా పని చేస్తోందని తేలింది. ఇప్పటివరకు కొత్తగా తయారవుతున్న కరోనా వేరియంట్స్‌పైన కూడా ఇదే స్థాయిలో సమర్థంగా పని చేస్తోందని గుర్తించారు. హైరిస్క్ ఉన్న వారు, 60 ఏళ్లకు పైబడిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిలో 91 శాతం సామర్థ్యంతో వ్యాక్సిన్ పని చేస్తోంది.
ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్న వాలంటీర్లలో ఎవరూ కరోనా బారిన పడి తీవ్ర లక్షణాలతో ఇబ్బంది పడలేదని సంస్థ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా సోకినా కూడా చాలామందిలో లక్షణాలు లేవని, కొందరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది. భారత్‌లో త్వరలోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మన పరిస్థితులకు తగ్గట్లుగానే ఈ వ్యాక్సిన్ ఉంది. కేవలం 2 – 8 డిగ్రీల సెల్సియస్‌లో అంటే సాధారణ ఫ్రిడ్జ్‌లో ఈ వ్యాక్సిన్‌ను భద్రపరిస్తే సరిపోతుంది.
అమెరికాకే చెందిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సి ఉంటుంది. మన దేశంలో ఇది కొంత కష్టంతో కూడుకున్న పని. నోవావాక్స్ విషయంలో ఈ ఇబ్బంది లేదు. పైగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికే నోవావాక్స్తో ఒప్పందం చేసుకున్నందున వేగంగానే వ్యాక్సిన్ల ఉత్పత్తి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ చివరి నాటికి 10 కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు.