ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసానికి వరద ముప్పు తలెత్తింది. ఉండవల్లిలోని కరకట్టపైన ఉన్న ఆయన నివాసానికి వరద ముప్పు ఉందని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ఏ క్షణమైనా వరద నీరు చంద్రబాబు నివాసంలోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు నివాసంతో పాటు కరకట్టపైన ఉన్న గెస్ట్ హౌజ్‌లు, ఇతర భవనాలకు సైతం అధికారులు నోటీసులు జారీ చేశారు.
కరకట్టపైన ఉన్న మొత్తం 36 భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కి వరద పొటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌లో రెండున్నర లక్షల క్యూసెక్కుల నీరు ఉంది. ఇది ఆరు లక్షల క్యూసెక్కులకు చేరే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భారీ వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికారుల సెలవులను సైతం రద్దు చేసి విధుల్లోకి హాజరుకావాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో మంత్రులు జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.