కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. వ్యాపారాలు మూతపడ్డాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. మరోవైపు లాక్ డౌన్ విధించిన సమయంలో దేశంలో ఏ ఒక్కరిని ఆకలితో ఉండనివ్వం అని ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఆచరణకు నోచుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈ తరుణంలో మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. భారత తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డుకెక్కిన నిర్మలా సీతారామన్ పదవిలో కొత్త మంత్రి రాబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ బ్యాంకర్ కేవీ కామత్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. అదే సమయంలో నిర్మలా సీతారామన్ ను కార్పొరేట్ శాఖ వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది.
కేవీ కామత్ బ్రిక్స్ దేశాల న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్ గా ఐదేళ్లు పూర్తి చేసుకున్నారు. త్వరలోనే అయన పదవీ బాధ్యతలను వేరొకరికి కట్టబెడతారని తెలియడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న కామత్ అంబానీల ఆస్థి పంపకాలలో కేవీ కామత్ పెద్ద దిక్కుగా వ్యవహరించారు. దీంతో ఆర్థిక శాఖకు ఇలాంటి అనుభవజ్ఞులైతే బావుంటుందని మోదీ భావిస్తున్నారట. మరోవైపు కామత్ పై అవినీతి ఆరోపణలు కూడా ఉండటంతో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.