ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలపై దుమారం రేగుతున్న విషయ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో నిమ్మగడ్డ గవర్నర్ తో భేటీ అయ్యారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి మధ్య వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో తాజాగా చోటుచేసుకున్న పరిస్థితులు, గ్రామ పంచాయతీ ఎన్నికలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. హై కోర్టులో జరిగిన పరిణామాలతో పాటుగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లను, ఉద్యోగ సంఘాల తీరు ఎడిటరావిషయాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. స్థానిక ఎన్నికలు జరగకుండా ప్రభుత్వం అడ్డు పడుతుందని గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అలాగే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సహకరించేలా గవర్నర్ ను నిమ్మగడ్డ కోరనున్నారు.
మరోవైపు ఏపీ ఎస్ఈసీ కోర్టులో వేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై హై కోర్టులో విచారణకు ధర్మాసనం స్వీకరించింది. కానీ వాదనలు ప్రారంభమైన కొద్దిసేపటికే విచారణను కోర్టు వాయిదా వేసింది. తిరిగి మధ్యాహ్నం దీనిపై విచారణ జరగనుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూలును సింగిల్ బెంచ్ ధర్మాసనం నిన్న కొట్టి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ తీర్పును సవాలు చేస్తూ నిమ్మగడ్డ డివిజన్ బెంచుకు వెళ్లారు.