తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 వతేదీ నుంచి 30 వ తేదీ వరకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను విధిస్తూ జీవోను జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా జీవోలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేసింది.
కర్ఫ్యూ నేపథ్యంలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, వ్యాపారాలు, రెస్టారెంట్లు రాత్రి 8 గంటలకే మూసివేయాలని తెలిపింది.. బార్లు, క్లబ్బులు, వైన్స్, షాపింగ్ మాల్స్ పై కూడా రాత్రి సమయంలో నిషేధం విధించింది.
అయితే కొన్ని రకాల అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపునిచ్చింది. మీడియా, పెట్రోల్ బంకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సర్వీసులు, కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, మెడికల్ షాపులకు మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగులపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. విమాన, బస్సులు, రైలు ప్రయాణికులకు కూడా మినయయింపు ఇచ్చారు.
అంతర్ రాష్ట్ర రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షలు ఉండవని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. వీరికి ఎలాంటి పాసులు, అనుమతులు అవసరం లేదని తెలిపింది. ఈ ఆదేశాలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ రాత్రి కర్ఫ్యూ, లాక్ డౌన్ అంశంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
కోర్టు ఆదేశాల మేరకే మేరకే రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేసినట్టుగా తెలుస్తుంది. కాగా గతంలో లాక్ డౌన్ సమయంలో రాత్రి 7 గంటల నుంచే కర్ఫ్యూ విధించగా ఇప్పుడు చిరు వ్యాపారాలు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఆ సమయాన్ని 9 గంటలకు పెంచినట్టుగా తెలుస్తుంది.