భారత్ లో కరోనా ఉగ్ర రూపం దాలుస్తుంది. ఒక్క రోజులో రికార్డు స్థాయి కేసులు నమోదవుతుండటంతో పొరుగు దేశాలు అప్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ దేశం భారత్ కు ఊహించని షాకిచ్చింది. భారతీయులకు తమ దేశంలోకి ఎంట్రీ లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారతీయ ప్రయాణికులపై నిషేధం విధిస్తూ ఆ దేశ ప్రధాని జెసిండా అర్డెర్న్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి నుంచి కరోనా ప్రబలకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న ఆమె ఇప్పుడు భారత్ లో కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని జెసిండా స్పష్టం చేసారు.
ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ నుంచి న్యూజిలాండ్ వచ్చే భారతీయులతో పాటుగా తమ దేశ పౌరులపై కూడా ఈ నిషేధం అమలులో ఉండనుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే ఈ కాలాన్ని మరికొన్ని రోజులు పెంచుతామని అన్నారు. కేవలం తమ దేశంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.
కరోనా మహమ్మారి పై పోరులో న్యూజిలాండ్ పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్నా ఆ దేశంలో మాత్రం 40 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఇటీవల న్యూజిలాండ్ సరిహద్దుల్లోని సిబ్బందికి కరోనా సోకినట్టుగా గుర్తించారు. తాజాగా అక్కడ 23 కేసులు బయటపడ్డాయి. అయితే అందులో సగానికి పైగా భారత్ నుంచి వచ్చిన వారే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.