logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌పై న్యూయార్క్ టైమ్స్ సంచ‌ల‌న క‌థ‌నం

భార‌త్‌లో న‌మోద‌వుతున్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాల‌పై అమెరికాకు చెందిన ప్ర‌ముఖ ప‌త్రిక ది న్యూయార్క్ టైమ్స్ సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. మ‌న దేశంలో క‌రోనాకు సంబంధించి చూపిస్తున్న అధికారిక లెక్క‌ల‌కు, వాస్త‌వ లెక్క‌ల‌కు చాలా తేడా ఉంద‌ని ఈ క‌థ‌నం చెబుతోంది. భార‌త‌దేశంలో వాస్తవికంగా ఎన్ని క‌రోనా కేసులు న‌మోదై ఉంటాయి, ఎన్ని మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయి అనే దానికి సంబంధించి మూడు అంచ‌నాల‌ను ఈ ప‌త్రిక ప్ర‌చురించింది. ఇందుకోసం 12 మంది నిపుణుల స‌హ‌కారాన్ని, దేశంలో జ‌రిగిన మూడు సీరో స‌ర్వేల స‌మాచారం, స్టాటిస్టిక్స్ ఆధారంగా ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

ప్ర‌స్తుతం అధికారిక లెక్క‌ల ప్ర‌కారం మే 27 నాటికి దేశంలో మొత్తం 2 కోట్ల 74 ల‌క్ష‌ల కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 3 ల‌క్ష‌ల 15 వేల మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. అయితే, ప్రభుత్వం చెబుతున్న లెక్క‌ల కంటే చాలా రెట్లు అధికంగా కేసులు, మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌నేది న్యూయార్క్ టైమ్స్ క‌థ‌నం సారాంశం. దేశంలో క‌రోనా ఉధృతి మామూలుగా ఉంద‌నుకుంటే ఇప్పుడు చెబుతున్న అధికారిక లెక్క‌ల కంటే 15 రెట్లు అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఈ ప‌త్రిక చెబుతోంది. అంటే, 40 కోట్ల 40 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డి ఉంటార‌ని, 6 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించి ఉండ‌వ‌చ్చ‌ని మొద‌టి అంచ‌నా వేసింది.

ఒక‌వేళ కనుక క‌రోనా ఉధృతి భారీగా ఉంటే.. అధికారిక లెక్క‌ల కంటే 20 రెట్లు అధికంగా క‌రోనా కేసులు ఉండ‌వ‌చ్చ‌ని ఈ ప‌త్రిక త‌న క‌థ‌నంలో పేర్కొంది. అంటే.. మొత్తం 53 కోట్ల 90 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డి ఉంటార‌ని, 16 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని అంచ‌నా వేసింది. ఒక‌వేళ క‌నుక దేశంలో క‌రోనా ఉధృతి అతి భారీగా ఉంటే.. అధికారిక లెక్క‌ల కంటే 26 రెట్లు అధికంగా క‌రోనా కేసులు న‌మోదై ఉండ‌వ‌చ్చ‌ని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది.

ఈ లెక్క‌న దేశంలో ఇప్ప‌టికే 70 కోట్ల 70 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డి ఉంటార‌ని, 42 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించి ఉంటార‌ని అంచ‌నా వేసింది. క‌రోనాకు సంబంధించి యంత్రాంగం ప‌టిష్టంగా లేక‌పోవ‌డం వ‌ల్ల వాస్త‌విక లెక్క‌లు న‌మోదు కావ‌డం లేద‌ని, చాలా మంది కరోనా బాధితులు ఇళ్ల‌లోనే ఉంటున్నార‌ని, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల‌లోనే క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయిన ఈ ప‌త్రిక చెప్పింది. అందుకే వాస్త‌వ లెక్క‌ల‌కు, అధికారిక లెక్క‌ల‌కు తేడా ఉంద‌ని క‌థ‌నంలో పేర్కొంది.

అయితే, న్యూయార్క్ టైమ్స్ ప్ర‌చురించిన ఈ క‌థ‌నాన్ని మ‌న కేంద్ర ప్ర‌భుత్వం ఖండించింది. ఈ క‌థ‌నానికి సంబంధించి న్యూయార్క్‌టైమ్స్ వ‌ద్ద ఎటువంటి ఆధారాలు లేవ‌ని నీతి ఆయోగ్ స‌భ్యుడు, ఇండియా కోవిడ్ టాస్క్‌ఫోర్స్ హెడ్ వీకే పాల్ స్ప‌ష్టం చేశారు. న్యూ యార్క్ టైమ్స్ క‌థ‌నంలో వాస్త‌వం లేద‌ని, దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స‌రిగ్గానే న‌మోద‌వుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

Related News