అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు బయటపడ్డ ఘటన సంచలనం రేపింది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ పని చేసింది తామే అని ‘జైష్ ఉల్ హింద్’ సంస్థ ప్రకటించిందని వార్తలు రావడం ఆ తర్వాత ఇదంతా ఫేక్ అంటూ ఆ సంస్థ ప్రకటించడం ఇలా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి మరణించాడు. అంబానీ ఇంటి ముందు పార్క్ చేసిన స్కార్పియో వాహనం యజమాని అనుమానాస్పద రీతిలో మృతి చెందడం పలు అనుమానాలు తావిస్తుంది. అయితే పోలీసులు మాత్రం అతను త్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.
కాగా ఫిబ్రవరి 25 న ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో ఒక వాహనాన్ని ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, బిట్ కాయిన్ ద్వారా తమకు డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ‘మీకు వీలైతే మమ్మల్ని ఆపండి’ అంటూ జైష్ ఉల్ హింద్ దర్యాప్తు సంస్థలకు సవాల్ విసిరిందని వార్త బయటకు వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. అంబానీ ఇంటి ముందు భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ కేసును 10 పోలీసు బృందాలు, ఎన్ఐఏ సంయుక్తంగా విచారిస్తుంది.