ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కులాల చుట్టూ ఎక్కువగా తిరుగుతాయి. ఏపీ రాజకీయాల్లో కులాల ప్రస్తావన పదే పదే తెస్తారు. ఎన్నికల ఫలితాలు కూడా ఎక్కువగా కులాల సమీకరణలపై ఆధారపడి ఉంటాయి. అందుకే గత కొన్ని రోజులుగా పార్టీలకు కులాలను అంటగట్టడం అనే సంప్రదాయానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలు తెరతీశాయి. ఇప్పుడు ఈ సంప్రదాయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి ఏకంగా ముగ్గురు ప్రధాన నాయకుల పేర్లలోనే మార్పులు చేసేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెడ్లు, తెలుగుదేశం పార్టీకి కమ్మలు, జనసేన పార్టీకి కాపులు ఎక్కువగా అండగా ఉంటారనే అభిప్రాయాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ మూడు పార్టీల అధినేతలు ఆయా సామాజకవర్గాలకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. అయితే, ఏ పార్టీ కూడా ఒక్క కులాన్ని నమ్ముకుంటే ఎన్నికల్లో గెలవలేదు. అధికారం కావాలంటే మిగతా కులాలను కూడా ఆకట్టుకోవాలి.
అధికారంలో ఉన్న పార్టీకి అండగా ఉన్న ఇతర కులాలను తమవైపు తిప్పుకోవాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ, ప్రభుత్వం కేవలం కమ్మ సామాజకవర్గానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ఆరోపించేది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అప్పట్లో వైసీపీ బాగా సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చినందున వైసీపీ కేవలం రెడ్లకే ప్రాధాన్యత ఇస్తోందని తెలుగుదేశం పార్టీ, జనసేన ఆరోపణలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా వివిధ నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ సలహాదారులు, యూనివర్సిటీల వీసీ పదవుల నియామకాల్లో రెడ్లకే ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ, జనసేన ఆరోపించాయి. సమయం దొరికినప్పుడల్లా వైసీపీ రెడ్లకు మాత్రమే అనుకూలంగా ఉందని నిరూపించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేశాయి.
ఇప్పుడు ఒకడుగు ముందుకేసి ముఖ్యమంత్రి జగన్‌ను జగన్ రెడ్డి అని పిలవడం ప్రారంభించారు టీడీపీ, జనసేన నాయకులు. ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్‌ను జగన్ రెడ్డి అని పిలవడం ప్రారంభించారు. మొదట వైసీపీ నేతలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, పవన్ పదేపదే జగన్‌ను ఇలా పిలవడం వెనుక జగన్ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారని ప్రజలకు తరచూ గుర్తు చేసే వ్యూహం ఉందని వైసీపీ గ్రహించింది.
అప్పటి నుంచి పేర్ని నాని వంటి వైసీపీ మంత్రులు పవన్ కళ్యాణ్‌ను పవన్ నాయుడు అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ బాటలో వెళుతోంది. జగన్‌ను జగన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు కూడా పిలవడం ప్రారంభించారు. దీంతో వైసీపీ కూడా చంద్రబాబును చంద్రబాబు చౌదరి అని పిలవడం ప్రారంభించింది.
నిజానికి రాష్ట్ర ప్రజలు జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని మాత్రమే ఎక్కువగా పిలుస్తారు. కులం తోకలను ప్రజలు పిలవరు. అలాగని వీరి కులం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియక కాదు. వీరిని ప్రజలు రాష్ట్ర నాయకులుగా చూస్తారు కానీ కులాలకు పరిమితమైన నాయకులుగా చూడరు. కానీ, నాయకులే ఒకరినొకరు ఇలా కులాలను ఒత్తి పలకడం వల్ల పెద్దగా సాధించేది ఏమీ ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.