యువతను విశేషంగా ఆకట్టుకొని ఇటీవలే మన ప్రభుత్వం చేత నిషేధానికి గురైన చైనా గేమింగ్ యాప్ పబ్జీ స్థానంలో అటువంటిదే కొత్త గేమ్ రాబోతోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ గేమ్‌కు తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ఆత్మ నిర్బర్లో భాగంగా ఈ స్వదేశీ యాప్‌ను తీసుకువచ్చినట్లు అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఈ కొత్త గేమ్ పేరు ఫౌజీ. పూర్తి పేరు ఫియర్లెస్ ఆండ్ యునైటెడ్ గార్డ్స్.
కేవలం వినోదమే కాకుండా మన సైనికుల త్యాగాలను సైతం చెప్పేలా ఈ గేమ్ ఉంటుందని అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఈ గేమింగ్ యాప్‌ను బెంగళూరుకు చెందిన ఎన్కోర్ అనే సంస్థ రూపొందించగా అక్షయ్ కుమార్ దీనికి మెంటార్‌గా ఉంటారు. ఈ యాప్‌పై వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని భారత్ కా వీర్ ట్రస్ట్ సంస్థకు అందిస్తామని అక్షయ్ కుమార్ ట్విట్టర్లో ప్రకటించారు.
దేశ భద్రత, రహస్యాలకు ముప్పుగా ఉన్నాయని భావిస్తూ పబ్జీ సహా చైనాకు చెందిన 118 యాప్‌లను తాజాగా కేంద్ర ప్రభుత్వం భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. పబ్జీకి యువతలో పెద్ద ఎత్తున ఆదరణ ఉండేది. ఇప్పుడు ఈ నిషేధంతో వారు కొత్త గేమ్‌ల వేటలో ఉన్నారు. ఇటువంటి సమయంలో అక్షయ్ కుమార్ ఫైజీ గేమ్ గురించి ప్రకటించడంతో వారిలో ఆసక్తి నెలకొంది.