కరోనా కాలంలో ఏపీ రాష్ట్ర సీఎస్ గా కీలక పాత్ర పోషించారు నీలం సాహ్ని. తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఆనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈ నెలాఖరుతో ఆమె పదవీకాలం ముగియనుంది. నిజానికి జూన్ 30 తేదీకే నీలం సాహ్ని పదవీ కాలం ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో కేంద్రం అనుమతితో ఆమె పదవీ కాలాన్ని పెంచారు.
కాగా డిసెంబర్ 31న ఆమె తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో ఏపీకి కొత్త సీఎస్ గా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. నీలం సాహ్ని తర్వాత సీఎస్ రేసులో ఆమె భర్త అజయ్ సాహ్ని సీనియర్ గా ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు.
అయితే వీరిలో అజయ్ సాహ్ని, రెడ్డి సుబ్రహ్మణ్యం, సమీర్ శర్మ కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్నారు. అభయ్ త్రిపాఠి ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ లో పని చేస్తున్నారు. సతీష్ చంద్ర చంద్రబాబు పేషీలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. జేఎస్వీ ప్రసాద్ పై సుముఖత వ్యక్తం చేయలేదట. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధిత్యనాధ్ దాస్ వైపు మొగ్గుచూపుతున్నట్టుగా సమాచారం.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఆదిత్యనాథ్ దాస్ 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసారు. ప్రస్తుత సీఎస్ పదవీ విరమణ రోజే కొత్త సీఎస్ నియామకంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.