జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హై కోర్టు ఆదేశాల మేరకు నెరేడ్ మెట్ డివిజన్లో రీకౌంటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్లను ముందుగా లెక్కించవద్దన్న హైకోర్టు ఆదేశాలతో వాటిని పక్కన పెట్టేసారు అధికారులు.
తాజాగా కోర్టు గ్రీస్న్ సిగ్నల్ ఇవ్వడంతో నెరేడ్ మెట్ లోని 136 డివిజన్ ఓట్ల లెక్కింపు జరిగింది. బుధవారం ఉదయం 8 గంటలకు సైనిక్ పురి లోని భవన్స్ కాలేజీలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ రీ కౌంటింగ్ లో నెరేడ్ మెట్ టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
నెరేడ్ మెట్ లో మొత్తం 25,176 ఓట్లు పోలవ్వగా.. 24,632 ఓట్లను లెక్కించారు. డిసెంబర్ 4న జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 504 ఓట్ల తో ముందంజలో ఉన్నారు. కోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం లెక్కించగా ఈసారి 782 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
అయితే ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. అధికారులు ఏక పక్షంగా వ్యవహరించారంటూ కనీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా మీనా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపించిన ప్రజలకు రీకౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చూసిన పోలీసులు, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.