తమ దేశ భూభాగానికి చెందిన కొన్ని ప్రాంతాలు భారత్ ఆధీనంలో ఉన్నాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రకటించారు. నేపాల్ ఇటీవల ఆ దేశానికి చెందిన కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో భారత్‌కు చెందిన కలాపాని, లిపులేఖ్, లింపియాధుర కూడా ఉన్నాయి. భారత్ ఆధీనంలో ఉన్న ఈ మూడు ప్రాంతాలూ తమవేనని నేపాల్ చెబుతోంది. 1816లో భారత్‌ను పాలిస్తున్న బ్రిటీషర్లతో చేసుకున్న సుగౌలి ఒప్పందం ప్రకారం ఈ మూడు ప్రాంతాలు తమవేనని నేపాల్ అంటోంది.
ఈ విషయమై అక్కడి పార్లమెంటులో మాట్లాడిన నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ.. భారత్‌తో దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ మూడు ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. గత పాలకులు ఈ ప్రాంతాల గురించి మాట్లాడలేదని, తాము మాత్రం ఈ ప్రాంతాలను స్వాధీనంలోకి తెచ్చుకుంటామని చెప్పారు. కాగా, నేపాల్‌తో మన దేశానికి సుమారు 1,800 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న మూడు ప్రాంతాలూ భారత్‌కు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతాలు. కాలాపాని, లింపియాధురలో 1962 చైనా యుద్ధం నుంచి భారత్ బలగాలను మోహరించింది. మన యాత్రికులు మానస సరోవర్ చేరడానికి లిపులేఖ కీలకమైన ప్రాంతం. ఇక్కడ ఇటీవల భారత్ నూతనంగా నిర్మించిన రోడ్డును రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సమయంలో తమ ప్రాంతంలో కొత్త రోడ్డు నిర్మిస్తున్నారని నేపాల్ ఆరోపించింది. అయితే, ఇది పూర్తిగా తమ భూభాగమేనని, పైగా తాము వేసింది కొత్త మార్గమేమీ కాదని, అనేక ఏళ్లుగా మానస సరోవర్ యాత్రికులు వెళుతున్న దారి ఇదేనని భారత్ స్పష్టం చేసింది.