భారత్ లోని లిపులిక్, లింపియదుర, కాలాపాని ప్రాంతాలను నేపాల్ తమ ఆంతర్గత భాగాలుగా చూపుతూ మ్యాప్ ను విడుదల చేసింది. కొత్త మ్యాపులను ప్రచురించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణకై నేపాల్ ప్రభుత్వం బుధవారం పార్లమెంటులో చర్చించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు ప్రధాని కేపీ శర్మ ఓలి సమాధానం ఇచ్చారు.
భారత్ తమ భూభాగంలో అక్రమంగా డ్యాములు నిర్మిస్తుందని దీనిపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందన్నారు. భారత్ ఆక్రమించిన భూభాగాలను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని అందులో భాగంగానే కొత్త మ్యాపులను రూపొందించినట్టుగా పేర్కొంది. నేపాల్ సరిహద్దుల వెంబడి లేని కాళీ నదిని సృష్టించి భారత్ దురాక్రమణలకు పాల్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇకపై వీటిని సహించబోమని తేల్చి చెప్పారు. భారత్ తో చర్చలకు తాము సిద్ధమేనని సామరస్యపూర్వకంగా ఆ మూడు ప్రాంతాలను తమకు అప్పగించవలసి ఉంటుందని నేపాల్ ప్రధాని పేర్కొన్నారు.
టిబెట్ లోని మానససరోవర్ కు చేరుకోవడానికి వీలుగా భారత్ నిర్మించిన మార్గం పై నేపాల్ విమర్శలు చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత భారత్ లోని లిపులేక్, లింపియదురా, కాలాపాని ప్రాంతాలను నేపాల్ లో భాగంగా చూపుతూ కొత్త మ్యాపులను విడుదల చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. నేపాల్ రూపొందించిన మ్యాపులకు ఎలాంటి చారిత్రాత్మక ఆధారాలు లేవని గతంలో భారత్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.