పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కలకలం రేవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. పొలం పనులు చేసుకుంటున్న ఆరుగురు మహిళా కూలీలు అస్వస్థతకు గురయ్యి అక్కడే పడిపోయారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ‘
కాగా మొత్తం 11 మంది అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వాంతులు, విరేచనాలతో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరంతా పశ్చిమ బెంగాల్ కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే వీరంతా నెల్లూరుకు వచ్చారు.
కాగా వీరందరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కాగా ఏలూరు ఘటనలో వందల మంది వింత వ్యాధి సోకి ఆసుపత్రుల్లో చేరుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీరికి కూడా అదే వ్యాధి సోకిందేమోనని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
కాగా ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ.. ఫుడ్ పాయిజన్ కారణంగానే కూలీలు అస్వస్థతకు గురై ఉండవచ్చని ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని అన్నారు. కాగా వీరికి సంబందించిన బ్లడ్ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం పంపించారు. ఫలితాలు వచ్చిన తరువాతే అస్వస్థతకు గల కారణాలు తెలిసే అవకాశం ఉంది.