logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌

నాయిని న‌ర‌సింహారెడ్డి మ‌చ్చ‌లేని రాజ‌కీయ నాయ‌కుడు. కార్మికుల ప‌క్ష‌పాతి. అధికార పార్టీలో ఉన్నా కార్మికుల ప‌క్షాన ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే ధైర్యం ఆయ‌న సొంతం. బ‌తికిన‌న్ని రోజులు మీసం మెలేసి దిల్‌దార్‌గా బ‌తికిన భోళా మ‌నిషి. ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టం త‌ప్ప ఆయ‌న‌కు క‌ల్మ‌షం, కుతంత్రం తెలియ‌దు. తొలి, మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మాల్లో చురుగ్గా పాల్గొన్న నికార్సైన ఉద్య‌మ‌కారుడు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి ప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దులుకున్న నిజాయితీప‌రుడు. నాయిని న‌ర‌సింహారెడ్డి రాజ‌కీయ జీవితంలో ఎన్నో మ‌లుపులు ఉన్నాయి.

నాయిని న‌ర‌సింహారెడ్డి న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ మండ‌లం నేర‌డుగొమ్మ గ్రామంలో 1934 మే 12న దేవ‌య్య రెడ్డి, సుభ‌ద్ర‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. హెచ్ఎస్‌సీ వ‌ర‌కు చ‌దువుకున్న ఆయ‌నకు విద్యార్థి ద‌శ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష బ‌లంగా ఉండేది. 1969 త‌లంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నారు. లాఠీ దెబ్బ‌లు తిన్నారు. 1970లో ఆయ‌న బ‌తుకుదెరువు కోసం హైద‌రాబాద్ బాట ప‌ట్టారు.

త‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, అన్యాయాన్ని నిల‌దీసే త‌త్వంతో కొన్ని రోజుల్లోనే కార్మికుల‌కు నాయ‌కుడిగా ఎదిగారు. హైద‌రాబాద్‌లోని వీఎస్టీ ఇండ‌స్ట్రీస్ కార్మిక సంఘం నేతగా ఎన్నిక‌య్యారు. న‌గ‌రంలో కార్మికుల‌కు ఎక్క‌డ స‌మ‌స్య ఉంటే అక్క‌డ కార్మికుల ప‌క్షాన ఆయ‌న అండ‌గా ఉండేవారు. దేశంలో మొద‌టిసారిగా కార్మికుల కోసం క్యాంటీన్‌, ర‌వాణా సౌక‌ర్యాన్ని వీఎస్టీ ఇండ‌స్ట్రీస్‌లో నాయిని న‌ర‌సింహారెడ్డి పెట్టించారు.

రామ్ మ‌నోహ‌ర్ లోహియా సిద్ధాంతాల‌కు అనుగుణంగా ఉమ్మ‌డి ఏపీలో హెచ్ఎంఎస్ కార్మిక సంఘాన్ని నాయిని స్థాపించారు. ఇప్ప‌టికీ ఆయ‌నే ఈ సంఘానికి నాయ‌కులు. కొంత‌కాలంలోనే హైద‌రాబాద్‌లోని కార్మికులంద‌రికీ నాయిని పెద్ద దిక్కుగా ఎదిగారు. కేవ‌లం హైద‌రాబాద్ మాత్ర‌మే కాదు ముంబై రిక్షా పుల్ల‌ర్స్ యూనియ‌న్‌కు కూడా నాయిని న‌ర‌సింహారెడ్డి నాయ‌క‌త్వం వ‌హించారు. న‌గ‌రంలో, దేశ‌వ్యాప్తంగా అనే కంపెనీల్లో కార్మిక నేత‌గా నాయిని ప‌ని చేశారు.

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ శిష్యుడిగా ఆయ‌న జ‌న‌తా పార్టీలో కీల‌కంగా ప‌ని చేశారు. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేసి 18 నెల‌ల జైలు జీవితం గ‌డిపారు. 1978 ఎన్నిక‌ల్లో ముషీరాబాద్ నుంచి ఆనాటి కాంగ్రెస్ ముఖ్య‌నేత టి.అంజ‌య్య‌పైన అనూహ్య విజ‌యం సాధించారు. నాయిని చేతిలో ఓడిన అంజ‌య్య అప్పుడే ముఖ్య‌మంత్రి అయ్యారు. నాయిని మాత్రం ఎమ్మెల్యేగా అదే స‌భ‌లో కొన‌సాగారు. 1985లోనూ జ‌న‌తా పార్టీ త‌ర‌పున మ‌రోసారి విజ‌యం సాధించారు.

నిఖార్సైన తెలంగాణ ఉద్య‌మ‌కారుడు నాయిని. 2001లో తెలంగాణ రాష్ట్ర‌మే ల‌క్ష్యంగా కేసీఆర్ పార్టీని స్థాపించిన‌ప్పుడు హైద‌రాబాద్ నుంచి కేసీఆర్ వెంట న‌డిచిన ఇద్ద‌రు, ముగ్గురు నాయ‌కుల్లో నాయిని ఒక‌రు. పార్టీ ఆవిర్భావం నుంచీ కేసీఆర్‌కు ఆత్మీయుడిగా, ఉద్య‌మ స‌హ‌చ‌రుడిగా ప‌ని చేశారు. 2004లో కాంగ్రెస్‌తో క‌లిసి టీఆర్ఎస్ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌గా నాయిని మ‌ళ్లీ ముషీరాబాద్ నుంచి ఘ‌న విజ‌యం సాధించారు.

వైఎస్సార్ క్యాబినెట్‌లో సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా నాయిని న‌ర‌సింహారెడ్డి ప‌ని చేశారు. తెలంగాణ‌పై కాంగ్రెస్ వైఖ‌రికి నిర‌స‌న‌గా మంత్రివ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించారు. ఆ స‌మ‌యంలో నాయిని అమెరికాలో ఉన్నారు. కేసీఆర్ ఒక్క మాట చెప్ప‌గానే ప్ర‌త్యేక రాష్ట్రం కోసం త‌న మంత్రిప‌ద‌విని తృణ‌ప్రాయంగా వ‌దులుకున్నారు. అమెరికా నుంచి తెల్ల కాగితంపై ఫ్యాక్స్ ద్వారా త‌న రాజీనామా లేఖ‌ను ఆనాటి ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డికి పంపించారు.

2009లో కేసీఆర్ ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగిన‌ప్పుడు నాయిని కేసీఆర్ వెంటే ఉన్నారు. వ‌య‌స్సు మీద ప‌డినా మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మంలో నాయిని క్రియాశీల‌కంగా ప‌ని చేశారు. తెలంగాణ క‌ల సాకారం అయిన త‌ర్వాత నాయినికి కేసీఆర్ హోంమంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడే కాదు మ‌ర‌ణించే నాటికి కూడా ఆయ‌న కార్మికుల‌కు నాయ‌కుడిగా కొన‌సాగడం గొప్ప విష‌యం. బుల్లెట్ బండి అంటే నాయినికి విప‌రీత‌మైన అభిమానం. యుక్త‌వ‌య‌స్సులో బుల్లెట్‌పైనే న‌గ‌రమంతా తిరిగి కార్మికుల‌ను ఐక్యం చేసే వారు.

ఇప్పుడు వ‌య‌స్సు మీద ప‌డినా ఆయ‌న ప్ర‌తీ రోజు త‌న బుల్లెట్‌ను తుడిపించి ఒక సారి స్టార్ట్ చేసి మురిసిపోయేవారు. అందుకే నాయినిని ముషీరాబాద్ ప్ర‌జ‌లు బుల్లెట్ న‌ర్సన్న అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. పార్టీల‌కు అతీతంగా తెలంగాణ‌లో అంద‌రూ గౌర‌వించే, అభిమానించే నాయ‌కుల్లో నాయిని న‌ర‌సింహారెడ్డి ఒక‌రు అన‌డంలో ఎటువంటి సందేహ‌మూ లేదు.

Related News