రెండు రోజుల క్రితం అదృశ్యమైన నవ్యా రెడ్డి(22) కేసును విచారిస్తున్న పోలీసులకు ఊహించని షాక్ ఎదురైంది. ఈ కేసు విచారణలో భాగంగా నవ్యా రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులకు కుక్కల గుట్ట సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను దారుణంగా హత్య చేసినట్టుగా గుర్తించారు. అయితే ఈ కేసులో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లా మధిర మండలం ఏర్రుపాలెం గ్రామానికి చెందిన నవ్యా రెడ్డి సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతుంది. ఆమెకు రెండు నెలల క్రితమే అదే ప్రాంతానికి చెందిన నాగశేషు రెడ్డితో వివాహమైంది. వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన నిందితుడు బెంగుళూరులో పని చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం తన భార్య కనిపించడం లేదంటూ నాగశేషు రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
ఈ కేసును విచారిస్తున్న సమయంలో నవ్య రెడ్డిని ఓ వ్యక్తి బైక్ పై తీసుకెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలు లభ్యమయ్యాయి. అందులో ఉన్నది ఆమె భర్తే అని నిర్దారించుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నవ్యారెడ్డి ని దారుణంగా హతమార్చడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నిందితుడితో పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు.