నవగ్రహారాలు చాలా శక్తివంతమైనవి. గ్రహదోషాల నుంచి పరిహారానికి నవగ్రహ ప్రదక్షిణ కంటే ఉత్తమమైన మార్గం లేదనేది ఆధ్యాత్మికవేత్తల సూచన. గ్రహస్థితిలో చోటుచేసుకునే మార్పుల వల్లనే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో నవ గ్రహాలను పూజిస్తే ఈ కష్టాల నుంచి బయటపడవచ్చు.
అనుకున్న పనులు నెరవేర్చుకోవచ్చు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడంలో చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఈ ప్రదక్షిణలకు నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది. అలా చేసినప్పుడే నవగ్రహాల అనుగ్రహాన్ని పొందగలుగుతాము. నవగ్రహాలకు ప్రదక్షిణం చేసేవారు శుచిగా స్నానం ఆచరించి, పరిశుభ్రమైన దుస్తులను ధరించాలి.
శివాలయాల్లో ఉండే నవగ్రహాలను దర్శించుకునేవారు ముందుగా మూలవిరాట్టును దర్శనం చేసుకుని ఆ తర్వాత బయటకు వచ్చి నవ గ్రహాల పూజ చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహ మూర్తులను తాకరాదు. నవగ్రహాల ప్రదక్షిణ కోసం మండపంలోకి వెళ్లేవారు సూర్యగ్రహాన్ని చూస్తూ లోపలి ప్రవేశించి.. ఎడమవైపు నుంచి అంటే చంద్ర గ్రహాన్ని చూస్తూ కుడివైపుకు తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.
అలాగే ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత కుడి వైపు నుంచి ఎడమవైపుకు అంటే బుధుడి నుంచి రాహు, కేతువులను స్మరిస్తూ మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఇలా చేసేటప్పుడు తొమ్మిది నవగ్రహలకు సంబందించిన 9 శ్లోకాలను స్మరించుకోవడం వల్ల గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. లేదా ఆయా గ్రహాల నామాలను, వర్ణాన్ని తలుచుకుంటూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. శని అనుగ్రహం కోరుకునేవారు హనుమాన్ చాలీసా, అష్టాక్షరీ, పంచాక్షరీ నామాలను జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
రాహు కేతువుల వల్ల ఏర్పడే ఆటంకాలు ఉండవని నమ్మకం. చివరగా ప్రదక్షిణనను చేసి నవగ్రహాలకు వెన్ను చూపకుండా బయటకు రావాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు మనస్సు, శరీరం అదుపులో ఉంచుకుని కేవలం భగవంతుడి మీదనే ధ్యాస ఉంచాలి. అప్పుడే మన శారీరక బాధలే కాకండా మానసిక బాధలు కూడా దూరమవుతాయి.