ఓ టీవీ ఛానల్ కామెడీలో షోలోని ఓ చిన్న స్కిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల అభిమానుల మధ్య చిచ్చు రాజేసింది. ముఖ్యమంత్రి జగన్‌ను అవమానించేలా వేసిన స్కిట్‌పై జగన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాగబాబు, యాంకర్ శ్రీముఖి, స్కిట్ వేసిన వారిని ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో జనసేన, పవన్ కళ్యాణ్ అభిమానులు నాగబాబుకు మద్దతుగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి అసభ్యంగా ట్రోల్ చేస్తూ నాగబాబుకు సపోర్ట్ చేస్తున్నారు.
ఇలా రెండు పార్టీల సోషల్ మీడియా సైనం మధ్య పెద్ద వార్ నడుస్తోంది. ఇటువంటి సమయంలో మరింత నిప్పు రాజేస్తూ నాగబాబు ట్విట్టర్లో చేస్తున్న పోస్ట్‌లు వైఎస్ జగన్ అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఒక్క వెంట్రుక కూడా పీకలేరని ఒకసారి, సింహాసనం మీద కుక్క ఉన్న ఫోటోను మరోసారి నాగబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఇరువైపులా వివాదం మరింత ముదిరి సోషల్ మీడియాలో తిట్లకు దిగారు.
జీ తెలుగు షోలో నాగబాబు బొమ్మ అదిరింది అనే కామెడీ షో నిర్వహిస్తారు. ఈ షోలో గల్లీ బాయ్స్ అనే టీమ్ సభ్యుడు రియాజ్ ముఖ్యమంత్రి జగన్‌ను అనుకరిస్తూ కామెడీ చేశాడు. జగన్ స్టైల్లో చేతులు ఊపుతూ, అన్న వస్తున్నాడు అనే జగన్ డైలాగ్ వినిపిస్తూ రియాజ్ వస్తుంటే మిగతా టీమ్ మేట్స్ పారిపోతుంటారు. 30 సెకన్లకు మించి ఈ స్కిట్ లేదు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్‌ను ఇలా అవమానించడం పట్ల ఆయన అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
రియాజ్ ఈ స్కిట్ చేస్తే నాగబాబు, యాంకర్ శ్రీముఖి, గెస్ట్ జానీ మాస్టర్ పగలబడి నవ్వుతారు. ఇది జగన్ ఫ్యాన్స్‌ను మరింత హర్ట్ చేసింది. అయితే, ఇంతకుముందు కూడా ఇదే షోలో జగన్‌ను హేళన చేసేలా ఒక స్కిట్ వేశారు. దీంతో నాగబాబు ప్రోద్భలంతోనే జగన్‌ను హేళన చేసేలా స్కిట్లు వేస్తున్నారని జగన్ అభిమానులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.
దీంతో యథావిడిగా స్కిట్ చేసిన రియాజ్, వ్రైటర్ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కానీ, జగన్ ఫ్యాన్స్ ఆగ్రహం చల్లారలేదు. నాగబాబును వారు టార్గెట్ చేశారు. అయినా, నాగబాబు ఏ మాత్రం తగ్గకపోగా జగన్ ఫ్యాన్స్‌ను మరింత రెచ్చగొట్టేలా ట్విట్టర్లో పోస్ట్‌లు పెడుతున్నారు. ఒక సింహాసనంపైన కుక్క కూర్చున్న ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. తర్వాత తన వెంట్రుక కూడా పీకలేరని, తనది రాయల్ హెయిర్ ఆయిల్ అని మరో ఫోటో పోస్ట్ చేశారు.
దీంతో ఆయన జగన్ అభిమానుల తిట్లకు, బెదిరింపులకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పడంతో పాటు ఈ వివాదాన్ని మరింత సాగదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి వైసీపీ నెటిజన్లను, ముఖ్యమంత్రి జగన్‌ను ట్రోల్ చేస్తున్నారు. మరి, ఈ వివాదం ఎలా సద్దుమణుగుతుందో చూడాలి.