ఇప్పుడో పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మై విలేజ్ షో’ ద్వారా నటుడిగా పరిచయమైన చంద్రమౌళి అలియాస్ చందు ఆ ఛానెల్ ఫాలో అయ్యే వారందరికీ సుపరిచితుడే. ఇటీవల అతనికి పెళ్లి కుదరడంతో పెళ్ళికి సంబందించిన శుభలేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ పెళ్లి పత్రిక చూసిన వారంతా చందును అభినందించకుండా ఉండాలకపోతున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. ఎవరైనా పెళ్లి శుభ లేఖ అంటే అందులో స్వస్తి శ్రీ చాంద్రమానేనా, ఆహ్వానించేవారు, పెళ్లి పిలుపు, శుభలగ్నం లాంటి పదాలతో కూడిన పత్రికని అచ్చు వేయిస్తుంటారు. జనరేషన్లు మారుతున్నా, పెళ్లిళ్లలో ఎన్నో వింత పోకడలు వస్తున్నా పెళ్లి పత్రిక అచ్చు వేయించడంలో మాత్రమే ఎలాంటి మార్పు లేదు.
అయితే తన పెళ్లి పత్రిక మాత్రం భిన్నంగా అందరికీ అర్ధమయ్యే విధంగా బాషా, యాసను కలగలిపి తయారు చేయించాలనుకున్నాడేమో ఈ యువకుడు అనుకున్నదే తడవుగా అంతా తెలంగాణలోని వాడుక భాషలో ఉన్న పదాలతో పెళ్లి కార్డు చేయించాడు. ఇప్పుడు ఈ పత్రిక చూసినవారంతా అదే యాసలో కామెంట్లు పెడుతూ సంతోషంతో ఉప్పొంగిపోయారు.
అతనికి పెళ్లి శుభాకాంక్షలు చెప్తున్నారు. కరీంనగర్ జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన చందు ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు తన ఛానెల్ లో కంటెంట్ లాగానే పెళ్లి శుభలేఖను కూడా వెరైటీగా తయారుచేసి వార్తల్లో నిలిచాడు.