ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలైంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించికుంది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూలు ప్రకారం.. మార్చి 10 వ తేదీన 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
మార్చి 2 నుంచి మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవలసి ఉంటుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. మార్చి 10వ తేదీ 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
మార్చి 13న అవసరమైతే రీపోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 14వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అదే రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నట్టుగా ఎన్నికల కమిషన్ షెడ్యూలులో పేర్కొంది. కాగా మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది.