టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనాను అర్థరాత్రి ముంబై పోలీసులు అరెస్ట్ చేసారు. అతనితో పాటుగా ప్రముఖ బాలీవుడ్ గాయకుడు గురు రాంధవాను కూడా పోలీసు అరెస్టు చేసారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగంలో వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.
ముంబై ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న డ్రాగన్ ఫ్లై క్లబ్ పై నిన్న అర్థరాత్రి పోలీసులు రైడ్ చేసారు. అనుమతి ఇచ్చిన సమయం తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా క్లబ్ ను తెరచి ఉంచారని పోలీసులు వెల్లడించారు. వీరితో పాటుగా క్లబ్ లోని ఏడుగురు సిబ్బంది మరో 34 మందిని పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత బెయిలుపై విడుదల చేసారు.
వీరిపై 188, 269, 34లు, ఎన్ఎండీఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. కాగా బ్రిటన్ లో కొత్త కరోనా కారణంగా కేంద్రం అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది.