logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయంగా బ‌ద్ధ శ‌త్రువులు. వీరిది మూడు ద‌శాబ్దాల రాజ‌కీయ వైరం. ఒక‌రిపై ఒక‌రు ఎత్తులు, పైఎత్తులు, వ్యూహాల‌తో యుద్ధం చేశారు. కొన్నిసార్లు చంద్ర‌బాబు గెలిచారు. మ‌రికొన్ని సార్లు రాజ‌శేఖ‌ర్ రెడ్డి గెలిచారు. వీరి మ‌ధ్య ఎప్పుడూ మాట‌ల యుద్ధం జ‌రిగేది. అయితే, రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు మంచి స్నేహితులు. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల్లో చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ.. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, నేనూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు.

తామిద్ద‌రూ మొద‌టిసారి ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రులు అయ్యాక ఒకే రూమ్‌లో ఉండేవారిమ‌ని చంద్ర‌బాబు గుర్తు చేసుకున్నారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డితో త‌నకు రాజ‌కీయ వైరం ఉంది కానీ వ్య‌క్తిగ‌తంగా మంచి మిత్రుల‌మ‌ని చెప్పారు. వైఎస్సార్‌, చంద్ర‌బాబు క‌లిసి సంతోషంగా న‌వ్వుకునే కొన్ని పాత వీడియోలు కూడా వీరి మ‌ధ్య స్నేహ‌బంధాన్ని తెలియ‌జేస్తాయి. అయితే, రాజ‌కీయాల్లో ఉన్న వారికి త‌ప్ప వీరి మ‌ధ్య ఉన్న స్నేహం బ‌య‌టి వారికి చాలా మందికి తెలియ‌దు.

ఇప్పుడు ఈ ఇద్ద‌రు దిగ్గ‌జ నాయ‌కుల మ‌ధ్య స్నేహాన్ని అంద‌రికీ తెలియ‌జేసేందుకు ఓ సినిమా తెర‌కెక్క‌బోతోంది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, చంద్ర‌బాబు నాయుడు స్నేహంపైనే ఈ సినిమా ఉండ‌నుంది. విష్ణు ఇందూరి, తిర‌మ‌ల్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా తెర‌కెక్కుతుంది. రాజ్ అనే ద‌ర్శ‌కుడు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. ఇప్ప‌టికే క‌థ ఫైన‌ల్ అయ్యింద‌ని తెలుస్తోంది. ఇద్ద‌రు నాయకుల ప‌రిచ‌యం, చిన్న వ‌య‌స్సులోనే ఇద్ద‌రు ఒకేసారి ఎమ్మెల్యేలు కావ‌డం, ఒకేసారి మంత్రులు కావ‌డం నుంచి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం వ‌ర‌కు సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

రాజ‌కీయంగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌రితో ఒక‌రు విభేదించుకున్నా వ్య‌క్తిగ‌తం ఎంత స‌న్నిహితులో ఈ సినిమాలో చూపించ‌బోతున్నారు. ఇటీవ‌ల తెలుగునాట రాజ‌కీయాల‌పై వ‌రుస‌గా సినిమాలు తెర‌కెక్కుతున్నాయి. ఇప్ప‌టికే ఎన్టీఆర్ జీవితంపై క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు రాగా, వైఎస్సార్ బ‌యోపిక్‌గా యాత్ర సినిమా తెర‌కెక్కి మంచి విజ‌యాన్ని అందుకుంది. త‌ర్వాత కూడా వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రాజ‌కీయ నేప‌థ్యంలో అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు, ప‌వ‌ర్ స్టార్ అనే సినిమాల‌ను తీశాడు.

అయితే, ఈ అన్ని సినిమాలు ఒక‌రికి అనుకూలంగానో, వ్య‌తిరేకంగానో తీసిన‌వే. ఇప్పుడు తెర‌కెక్క‌బోయే సినిమా మాత్రం ఇద్ద‌రు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య స్నేహాన్ని చూపించేలా ఉండ‌బోతోంది. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీతో పాటు సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ ఈ సినిమా ఆస‌క్తిని పెంచ‌బోతోంది. నిజానికి, వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధం తెలిసిన వారు వీరి స్నేహం గురించి గొప్ప‌గా చెబుతారు. మ‌రి, సినిమాలో ఎలా చూపిస్తారో చూడాలి.

Related News