logo

  BREAKING NEWS

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు..!

తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అసెంబ్లీ అంచనాల కమిటీ తొలి ఛైర్మెన్ సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. కాగా ఆరోగ్యం క్షీణించడంతో గత రాత్రి 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. రామలింగారెడ్డి దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో 1961లో జన్మించారు.

చిన్ననాటి నుంచే ఉద్యమాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఇంటర్ తరువాత ఆర్ ఎస్ యు (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1983 తరువాత ఉదయం దినపత్రికలో రిపోర్టర్ గా చేరారు. సిద్ధిపేట జిల్లా రిపోర్టర్ గా పని చేస్తున్న సమయంలో ప్రజల సమస్యలపై పోరాడారు. ఆయనకు భార్య, కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. పాతికేళ్ళ పాటు జర్నలిస్టుగా పని చేసిన రామలింగారెడ్డి 2004లో టీఆర్ఎస్ పార్టీ లో చేరి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. మొత్తం నాలుగు సార్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దేశంలోనే మొట్ట మొదటి టాడా కేసు నమోదైన వ్యక్తి రామలింగారెడ్డి కావడం గమనార్హం. అప్పట్లో పీపుల్స్ వార్ సంస్థతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆయనపై టాడా కేసు నమోదు చేసారు.

కాగా అయన మృతితో దుబ్బాక నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామలింగారెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేసారు. హైదరాబాద్ నుంచి ఆయన యన మృత దేహాన్ని ఈరోజు దుబ్బాక తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News