ఆయన జీవితమంతా వెన్నుపోటు, శవ రాజకీయాలు చేయడానికే సరిపోయిందని.. కరోనా సోకి తిరుపతి ఎంపీ చనిపోతే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని హడావిడి చేస్తున్నారంటూ నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.
కార్తీక మాసంలో శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే వెయ్యికాళ్ల మండపం ప్రారంభించే విధంగా టీటీడీ ఛైర్మెన్ పనులు చేపట్టారన్నారు. ప్రతిపక్షాల తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. కరోనాతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కున్నారన్నారు.
ఆయన ప్రజలకు ఏం భరోసా ఇస్తారని ఎద్దేవా చేసారు. స్థానిక సంస్థల నిధులు రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని భావించి ఎన్నికలు నిర్వహించాలని కోరితే.. కరోనా సాకుతో వాయిదా పడేలా చేసారు. ఇప్పుడు రాష్ట్రంలో కరోనానే లేదు ఎన్నికలు నిర్వహించాలని స్టేట్మెంట్లు ఇస్తున్నారు అన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు మూడున్నర కోట్ల అప్పుల్లో ముంచేశారన్నారు. మార్చిలోపల ఎన్నికలు జరిగితే అన్ని స్థానాలు తామే గెలుచుకుంటామన్న భ్రమలో టీడీపీ ఉందన్నారు.