అచ్చెన్నాయుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే ప్రభుత్వం అతనిపై కక్షగట్టిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. తప్పు చేసిన వ్యక్తి బీసీ అయినా ఓసీ అయినా చట్టం ముందు ఒకటేనన్నారు. అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని రోజా విమర్శించారు.
టీడీపీది రెండు నాల్కల ధోరణి అన్నారు. ప్రజల్లో గెలవలేని లోకేష్ మాటకు విలువలేదని, అయన చెబితే ఎవరూ పట్టించుకోరన్నారు. తాము తప్పు చేస్తే అరెస్టు చేసుకోవచ్చని గతంలో తొడగొట్టి చెప్పిన లోకేష్ ఇప్పుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేస్తే ఎందుకు మండిపడుతున్నదని ఆమె ప్రశ్నించారు. 150 కోట్ల అవినీతికి పాల్పడి వివరణ ఇచ్చుకుంటే ప్రభుత్వం వదిలిపెడుతుందా అని ఆమె ప్రశ్నించారు.
పేద కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో మందులు, పరికరాలను ఇష్టం వచ్చిన వారికీ కట్టబెట్టారు, ప్రజల డబ్బును దోచుకున్నారన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హయాం లో ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుకలో జరిగిన అవినీతి ప ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆ అవినీతి బయటకు రాగానే చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు.