logo

ఎంపీ ప‌ద‌విపై క‌న్నేసిన రాజాసింగ్‌.. అక్క‌డి నుంచి పోటీ

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఫైర్‌బ్రాండ్ లీడ‌ర్‌, గోషామ‌హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్ల‌మెంటు సీటుపై క‌న్నేశారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకోసం ఇప్ప‌టి నుంచే ఆయ‌న క‌స‌ర‌త్తు ప్రారంభించారు. బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పార్ల‌మెంటుకు పోటీ చేయించాల‌ని బీజేపీ కూడా భావిస్తోంది. దీంతో 2024లో రాజాసింగ్ లోక్‌స‌భ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మే. అయితే, ఆయ‌న హైద‌రాబాద్ వీడి వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డ‌మే ఇక్క‌డ ట్విస్ట్ అని తెలుస్తోంది.

గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంది. ఇందులో మూడు సీట్లు ఉత్త‌ర తెలంగాణ ప్రాంతానివే. ఉత్త‌ర తెలంగాణ‌లో పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌లు బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నార‌నేది గ‌త ఎన్నిక‌లు స్ప‌ష్టం చేశాయి. ఇప్పుడు రాజాసింగ్ కూడా తాను ఎంపీగా పోటీ చేయ‌డానికి ఈ ప్రాంతం అయితే బెట‌ర్ అనే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయ‌న ఎమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని జ‌హిరాబాద్ లోక్‌స‌భ స్థానాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ సీటు నుంచి తాను పోటీ చేస్తే కచ్చితంగా గెలుస్తాన‌ని ఆయ‌న న‌మ్మ‌కంగా ఉన్నారు.

నిజానికి రాజాసింగ్ ప‌క్కా హైద‌రాబాదీ లీడ‌ర్. ఆయ‌న రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గోషామ‌హ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం హైద‌రాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది. అయితే, ఈ సీటులో ముస్లింల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉంది. అందుకే 1984 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 10 సార్లుగా ఎంఐఎం పార్టీనే గెలుస్తోంది. గ‌త నాలుగుసార్లుగా అస‌దుద్దిన్ ఓవైసీ గెలుస్తున్నారు. హైదరాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క గోషామ‌హ‌ల్ మిన‌హా మిగ‌తా అన్ని ఎంఐఎం గెలుచుకునే సీట్లే.

కాబ‌ట్టి, హైద‌రాబాద్‌లో బీజేపీకి గెలుపు అవ‌కాశాలు దాదాపు ఉండ‌వు. రెండోస్థానానికే బీజేపీ ప‌రిమితం అవుతుంది. రాజాసింగ్ ఇక్క‌డి నుంచి పోటీ చేసినా రిజ‌స్ట్ ఇదే ఉంటుంది. అందుకే, ఆయ‌న జ‌హిరాబాద్ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికైతే జ‌హిరాబాద్‌లో బీజేపీ అంత బ‌లంగా లేదు. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి ఒక ల‌క్షా 38 వేల ఓట్లు వ‌చ్చి మూడో స్థానంలో నిలిచింది. అయితే, బ‌ల‌మైన అభ్య‌ర్థి నిల‌బ‌డితే ఇక్క‌డ త‌మ పార్టీ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆ పార్టీ భావిస్తోంది.

జ‌హిరాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలోని జుక్క‌ల్‌, బాన్స్‌వాడ‌, యెల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా ప‌రిధిలో ఉంటాయి. ఇక్క‌డ బీజేపీ ప్ర‌భావం బాగానే ఉంటుంది. కాబ‌ట్టి, ఇక్క‌డి నుంచి రాజాసింగ్ పోటీ చేస్తే ఆయ‌న ఇమేజ్ కూడా క‌లిసివ‌చ్చి జ‌హిరాబాద్ లోక్‌స‌భ సీటు బీజేపీ ఖాతాలో ప‌డే అవ‌కాశాలు ఉండ‌వ‌చ్చు. ఎలాగూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు పార్లమెంటు ఎన్నిక‌ల కంటే ముందే జ‌రుగుతాయి. కాబ‌ట్టి, రాజాసింగ్ జ‌హిరాబాద్ నుంచి పోటీ చేయ‌డానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అందుకే, ఆయ‌న ఇప్ప‌టి నుంచే జ‌హిరాబాద్‌పై ప్ర‌త్యేకంగా న‌జ‌ర్ పెట్టార‌ని తెలుస్తోంది.

Related News