సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకువస్తానని నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేటకు ఎయిర్ పోర్టు ఎలా వస్తుందని అయన ప్రశ్నించారు. 2004లో హైదరాబాద్ లో ఎయిర్ పోర్టు నిర్మించే సమయంలో జీఎంఆర్ సంస్థకు, సివిల్ ఏవియేషన్‌కు మధ్య జరిగిన ఒప్పందం జరిగిందన్నారు.
దాని ప్రకారం.. హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు 150 కిలోమీటర్ల పరిధి వరకు ఎయిర్ పోర్టు నిర్మించడానికి అనుమతులు లేవు. ఈ ఒప్పందం 2033 మర్చి 23 వరకు కొనసాగుతుందన్నాయి రఘునందన్ వివరించారు. ఈ నేపథ్యంలో సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఏ విధంగా సాధ్యపడుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు.
కేసీఆర్ 115 నియోజకవర్గాలకు కాకుండా రెండు నియోజకవర్గాలకు మాత్రమే ముఖ్యమంత్రిలా వ్యవహరించడం సరికాదన్నారు. సిద్దిపేటతో సమానంగా దుబ్బాకను కూడా అభివృద్ధి పరచాలన్నారు. సిద్దిపేటకు విమానాశ్రయం తెచ్చే ముందు దుబ్బాకలో పాత బస్టాండు కూలిపోయే స్థితిలో ఉందని దాని స్థానంలో కొత్త బస్టాండుకు నిధులు మంజూరు చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేసారు.
గతంలో వరంగల్ కు కూడా విమానాశ్రయం తెస్తానని సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. కాగా త్వరలో వరంగల్, సిద్ధిపేట, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేసీఆర్ ఓట్ల కోసం కొత్త మాటలు చెబుతున్నారన్నారు.