తెలంగాణ పీసీసీ పదవిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా పీసీసి పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. ఎవరికి వారు ఈ పదవి కోసం కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అటు అధిష్టానం కూడా డైనమిక్ లీడర్ గా పేరున్న వారికే పదవిని కట్టబెట్టాలనే యోచనలో ఉంది.
ఈ సస్పన్స్ కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధిష్టానానికి మరోసారి పలు సూచనలు చేసారు. ఈ మేరకు ఆయన సోనియా గాంధీ, రాహుల్, ఇంచార్జ్ ఠాగూర్ కు లేఖ రాసారు. అధిష్టానం పిసిసి పదవిపై తొందర పడవద్దని ఆయన సూచించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ నే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలన్నారు.
రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేకపోవడంతో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు ప్లాన్ చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఎంఐఎం, టీఆర్ ఎస్ పార్టీలను పరోక్షంగా వాడుకుంటుందన్నారు. ఇలాంటి సమయంలో బలమైన నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలన్నారు.
అందుకే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాతనే పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలన్నారు. జానారెడ్డి నాయకత్వంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. అధిష్టానం ఎవరినైతే ఈ పదవికి ఎంపిక చేయాలని అనుకుంటుందో దానిపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని అన్నారు.