logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

మూవీ రివ్యూ: ‘మిస్ ఇండియా’

నటీనటులు: కీర్తి సురేష్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సుమంత్ శైలేంద్ర, నవీన్ చంద్ర, నదియా, నరేష్, కమల్ కామరాజు, పూజిత పొన్నాడ తదితరులు
దర్శకత్వం: నరేంద్రనాథ్
సంగీతం: థమన్
నిర్మాత: మహేష్ కోనేరు

‘మహానటి’ సినిమాతో జాతీయ స్థాయి ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత ఆమె నటించిన ‘పెంగ్విన్’ సినిమా భారీ అంచనాల మధ్య ఓటీటీలో విడుదలై నిరాశపరిచింది. ఇప్పుడు కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో ‘మిస్ ఇండియా’ అనే లేడి ఓరియెంటెడ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ:
మానస సంయుక్త పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తుంది. విశాఖ పట్నంలోని లంబసింగి ప్రాంతానికి చెందిన ఓ మధ్యతరగతి అమ్మాయి. పెద్దయ్యాక సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలనేది ఆమె చిన్ననాటి కల. అందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ ఆమెకు తోడు నిలవక పోయినా తాత విశ్వనాథ శాస్త్రి(రాజేంద్రప్రసాద్) ప్రోత్సాహంతో పెరుగుతుంది. సంయుక్తకు చిన్ననాటి నుంచి టీ అంటే చాలా ఇష్టం. ఎంబీబీఎస్ పూర్తి చేసి అమెరికా వెళ్తుంది. తాత నేర్పిన హెర్బల్ టీనే అక్కడ తన బిజినెస్ గా ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు విలన్ జగపతి బాబు రూపంలో ఎదురైన సవాళ్లేంటి? అతని వల్ల ఆమె కళలు కన్న వ్యాపారంలో ఎలా నష్టపోతుంది? తిరిగి ఎలా అనుకున్నది సాధిస్తుంది అనేది సినిమా కథాంశం. అలాగే సినిమాలో నవీన్ చంద్ర, విక్రమ్ పాత్రలు ఏమిటి? సంయుక్త ప్రయాణంలో వీళ్ళు ఎలా తోడయ్యారనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:
మిస్ ఇండియా సినిమాకు రచన దర్శకత్వం అందించిన నరేంద్ర నాథ్ ఈ సినిమాను కమర్షియల్ పంథాలో తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నచ్చిన పనినే కెరీర్ గా చేసుకుని విజయం సాధించాలనుకునే అమ్మాయి పాత్రలో కీర్తి సురేష్ మరోసారి తన నటనతో అలరించింది. మధ్యతరగతి యువతిగా, బిజినెస్ వుమెన్ గా రెండు షేడ్స్ లో ఆమె మెప్పించింది. ఎప్పటిలాగే జగపతి బాబు విలనిజం పండించడంలో సక్సెస్ అయ్యారు. వ్యాపారవేత్తగా ఎదుగుతున్నప్పటి వరకు సినిమాను కూల్ గా నడిపించిన దర్శకుడు హీరోయిన్ కు మొదటి ఎదురు దెబ్బ తగలగానే కథ కథనంలో వేగాన్ని పెంచాడు. అయితే హీరోయిన్ ఎంచుకున్న బిజినెస్ పాయింట్ ను ఇంకాస్త బలంగా చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు వినియోగించుకోలేకపోయాడు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో కథను ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా ముగించారు. హీరోయిన్ చేత పలికించిన డైలాగులు బాగున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో వాటిని అతిగా ఎలివేట్ చేయడం, విలన్ తో పంచ్ డైలాగులు చెప్పి వెళ్లిపోవడం ప్రేక్షకులకు కొంచెం విసుగు పుట్టిస్తాయి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ మధ్య తరగతి యువతి అమెరికాలోనే టాప్ బిజినెస్ మ్యాన్ అయిన విలన్ ను సునాయాసంగా కలుసుకోవడం, అతను కాదంటే సవాలు చేయడం, రెండు నెలల్లోనే టాప్ పొజిషన్లో బిజినెస్ ను డెవలప్ చేయడం, దేశమంతా బ్రాంచులు మొదలు పెట్టి విలన్ ను దెబ్బకొట్టడం వంటి సీన్లు రియాలిటీకి దూరంగా అనిపిస్తాయి. సినిమాలో వినోదం పండించే సన్నివేశాలు ఎక్కడా లేకపోవడం ఓ వర్గం ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. అయినా సినిమా ఆసక్తికరంగానే సాగుతుంది. దర్శకుడు నరేంద్రనాథ్, మరో రచయితగా పనిచేసిన తరుణ్ కుమార్ రాసుకున్న సంభాషణలు బాగున్నాయి. సినిమాకు మరో ఆకర్షణగా సినిమాటోగ్రఫీ నిలుస్తుంది. థమన్ సంగీతం ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రధారులైన రాజేంద్రప్రసాద్, నదియా, పూజిత పొన్నాడ, నవీన్ చంద్ర మరో హీరోగా నటించిన సుమంత్ శైలేంద్ర తమ పరిధి మేర నటించారనే చెప్పొచ్చు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:
కీర్తి సురేష్ నటన, స్టోరీ లైన్, డైలాగ్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

మైనస్ పాయింట్స్:
వినోదం లేకపోవడం, క్లైమాక్స్ వీక్ గా ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

రేటింగ్స్: 3/5

Related News