స్కూల్ ఏజ్‌లో ఉన్న మీ కుమారుడికి బండి ఇస్తున్నారా ? బండి లేదా కారుపై దూసుకుపోతుంటే సంబరపడుతున్నారా ? అప్పుడే మా పిల్లలు వాహనాలు నడుపుతున్నారు అని గొప్పలు పోతున్నారా ? గొప్పలే కాదు జైలుకు పోవడానికి కూడా రెడీగా ఉండండి. లైసెన్స్ లేకుండా మీ పిల్లలకు గారాభంతో బండి ఇస్తే తర్వాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు తీసుకున్న చర్చలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ వీడియో.
మేడ్చల్ జిల్లా సూరారం కాలకి చెందిన సోము పోచయ్య అనే వ్యక్తి కుమారుడు జగదీశ్. అతడికి లైసెన్స్ లేదు. అయినా తండ్రి బండి నడిపిస్తుంటాడు. పోయిన నెల 28న ఇలాగే బైక్ తీసుకెళ్లి ఒకరిని ఢీకొట్టడంతో అతడు మరణించాడు. ఒక వ్యక్తి మృతికి కారణమైన జగదీశ్‌తో పాటు లైసెన్స్ లేని వ్యక్తికి బండిచ్చిన అతడి తండ్రి పోచయ్యను కూడా దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు.
మనలో చాలామంది పిల్లలకు డ్రైవింగ్ వచ్చినా, రాకపోయినా, లైసెన్స్ లేకపోయినా, కనీసం పద్దెనిమిదేళ్లు నిండకపోయినా బైక్, కారు ఇస్తుంటాము. వారు బండి నడుపుతుంటే మనం కూడా సంబరపడుతుంటాం. మరికొందరు పిల్లలేమో బలవంతంగా తల్లిదండ్రుల వద్ద నుంచి బైక్ తీసుకోని నడిపిస్తుంటారు. ఇంకొందరు చాటుగా తీసుకువెళతారు. ఎలా అయినా సరే లైసెన్స్ లేని పిల్లలకు బండ్లు ఇస్తే పేరెంట్స్పైన, బండి ఇచ్చిన వారిపైనే కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు. కాబట్టి, పిల్లలకు బండ్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
పిల్లలకే కాదు తెలిసిన వారికి, స్నేహితులకు కూడా అడగగానే బండ్లు ఇవ్వొద్దు. వాళ్లకు లైసెన్స్ లేకపోతే మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవల నేపాల్‌కు చెందిన ఇద్దరు హైదరాబాద్‌లో బైక్ యాక్సిడెంట్లో మరణించారు. బైక్ నడిపిన నేపాలీకి లైసెన్స్ లేదు. దీంతో అతడికి బైక్ ఇచ్చిన స్నేహితుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేశారు. కాబట్టి, ఎవరైనా సరే లైసెన్స్ లేని వారికి మీ వాహనం ఇస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.