ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరో షాక్ తగిలింది. పంచాయతీ రాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పీలుపై హైకోర్టు కీలక తీర్పను వెల్లడించింది. మీడియాతో మాట్లాడేందుకు షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. మంత్రి ఇకపై మీడియాతో మాట్లాడవచ్చని .. అయితే ఎస్ఈసీని లక్ష్యంగా చేసుకుని ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు మంత్రి పెదిరెడ్డికి సూచించింది.
మీడియాతో మాట్లాడవద్దని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై మంత్రి డివిజన్ బెంచిలో అప్పీలు చేసారు. మీడియాతో మాట్లాడకుండా నిలువరించడం అంటే తన భావప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని మంత్రి పిటిషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, తన నుంచి వివరణ తీసుకోకుండా ఎస్ఈసీ ఈ ఆదేశాలను జారీ చేసిందని మంత్రి పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచు బుధవారం తీర్పును ప్రకటించింది.
కాగా ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మంత్రి పెద్దిరెడ్డిని గృహనిర్బధంలో ఉంచాలని, మీడియాతో మాట్లాడకుండా చూడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి గతంలో హై కోర్టును ఆశ్రయించగా ఎస్ఈసీ ఆదేశాలను కొట్టివేసింది. కానీ మీడియాతో మాట్లాడవద్దని షరతులు విధించింది. ఈ అంశం పై తాజాగా మరోసారి మంత్రి పెద్దిరెడ్డికి భారీ ఊరట లభించింది.