ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖామంత్రి పెద్ది రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో కీలక బాధ్యతను అప్పగించింది. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డిని నియమించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సుకు ఏపీ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదరన్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ రాష్ట్రాలు పాల్గొననున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యే ప్రముఖుల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా కేంద్ర పాలిత రాష్ట్రాల లెఫ్టినెంట్లు, గవర్నర్లు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఇతర ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథుల కోసం అవసరమైన ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది.