తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ పట్టాభిషేకం హాట్ టాపిక్ గా మారుతున్న నేపథ్యంలో మరో టీఆర్ఎస్ మంత్రి ఈ విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఈరోజు ఉదయం రైల్వే ఉద్యోగాల సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటుగా డెప్యూటీ స్పీకర్ పద్మారావు కూడా పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కొంతకాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతున్నా కేటీఆర్ ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి పద్మారావు కేటీఆర్ సమక్షంలోనే ఈ విషయాన్ని మరోసారి నిర్దారించారు.
”మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అతి త్వరలోనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మా శాసన సభ రైల్వే కార్మికుల తరపున, అందరి తరపున కాబోయే ముఖ్యమంత్రికి కంగ్రాట్స్ చెబుతున్నాము” అంటూ ఆయన వేదికపైనే వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పక్కనే కూర్చున్న కేటీఆర్ మంత్రి పద్మారావు వ్యాఖ్యలపై స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ కూడా కేటీఆర్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రిగా కేటీఆర్ అన్ని విధాలా సమర్థుడని.. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా శిరసా వహిస్తామన్నారు.